Wednesday 4 January 2012

మనీషాపంచకం'-4



యా తిర్యన్నర దేవతాభి రహమిత్యంత స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాంతి స్వతో చేతనా
తాం భాస్యై: పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృత మానసోహి గురురిత్యేషా మనీషా మమ

ఏ కళ వెలుగై కదలు వాటిలో
వృక్ష జాలముల, జంతు కోటిలో
మానవులందు, దేవతలందు
దృశ్యమానమై వెలుగుచున్నదో
హృదయ కుహరమున వెలిగేనేకళ
ప్రాణి కోటికిల ప్రాణమైన కళ
తన వెలుగునుగొని జీవులు కళకళ
లాడుచుండునో సాగుచుండునో
ఆ వెలుగారిన ఆగుచుండునో
ఆ వెలుగుల గని వెలిగించునది
వెలుగు వానిలో కనిపించునది
జీవకోటికా వెలుతురొక్కటే
జీవులన్నిటా వెలుగునొక్కడే
అని తెలిసిన మానవుడెవరైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు!

కదిలే వానిలో(తిర్యక్కులలో),మానవులలో,దేవతలలో..అందరిలో
అన్నింటా స్ఫుటంగా స్పష్టముగా కనిపించునది, గ్రహింపబడునది,
ఏ కళ హృదయకుహరములో వెలుగొందడం వలన స్వతహాగా
కళ,చైతన్యం,కదలిక లేనివి కళ, చైతన్యం,కదలిక వున్నవానిలాగా
కనిపిస్తాయో, ఏ వెలుగు అంతర్గతంగా వెలుగొందుతుండడం వలన
పైకి కనిపించే శరీరాలు, జీవులు ఆ వెలుగును ఆ కళను (ప్రాణకళ,జీవకళ)
ను కలిగిఉన్నట్లుగా కనిపిస్తాయో ఆ కళను, ఆ వెలుగును, ఆ చైతన్యము
సత్యము, నిత్యము, శాశ్వతము అని తెలిసికొన్న మహానుభావుడు,
నిరంతరమూ ఆ స్ఫూర్తిని,ఆ సత్యమును,నిత్యమును, శాశ్వతమును
మననం చేసే మహానుభావుడు జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా
ఎవరైనా సరే, ఆయనే నా గురుదేవుడు, నా దృష్టిలో మహానుభావుడు!
మనీషాపంచకం లోని ఈ నాలుగవ శ్లోకం అధర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషతు
లోని 'అయమాత్మా బ్రహ్మ' అనే మహావాక్యానికి వ్యాఖ్యాన పూర్వకమైనది! పరమశివుడు
శుకమహర్షికి ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తూ..

'' స్వప్రకాశాపరోక్షత్వం ఆయమిత్యుక్తితోమతం| అహంకారాది దేహాంతం ప్రత్యగాత్మేతి గీయతే ''
అన్నాడు, అంటే స్వప్రకాశమైనది, తనే తనంతగా వెలిగేది, ఎక్కడినుండో తెచ్చుకున్న
వెలుగుతో వెలిగేది కానిది, తనే వెలుగుతూ వెలిగించేది..అపరోక్షం అంటే పరోక్షం కానిది..అంటే
ప్రత్యక్షమైనది..'అయం''ఇది' అనబడేది 'అహంకారం' మొదలైన వాటికీ భిన్నమైనది..ఆది
ప్రత్యగాత్మ అనబడుతుంది..పరమశివుడు ఇంకా..

'దృశ్య మానస్య సర్వస్య జగతత్తత్త్వ మీర్యతే|బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం'..

అన్నాడు..అంటే కంటికి కనిపించే సర్వజగమూ ఆ బ్రహ్మ పదార్ధముచేత, అంటే ఆ ప్రత్యగాత్మ
చేత నిండి వున్నది. ఆ బ్రహ్మ పదార్ధము, ఆ ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది..అంటే అదే నిజమైన
వెలుగు..ఆ వెలుగే మిగిలినవన్నీ వెలిగేటట్లుగా చేస్తుంది, వాటిలో అంతర్గతంగా తాను వెలగడం
ద్వారా..ఈ వెలుగు ఉన్నంత కాలమే అవి వెలుగుతున్నట్లుగా కనిపిస్తాయి..సూర్యుని వెలుగును
చంద్రుడు,నక్షత్ర గ్రహ గణాలు గ్రహించి వెలుగుతున్నట్లుగా..విద్యుత్తును గ్రహించి విద్యుద్దీపాలు
వెలుగుతున్నట్లుగా..కనుక ఆ శాశ్వతమైన వెలుగును గుర్తించి, గుర్తుంచుకుంటూ, నిరంతరం
మననం చేసే మహానుభావుడు ఎవరైనా సరే అతనే నా గురుదేవుడు!

ప్రాణుల శరీరాలలో ఆ వెలుగు ప్రాణ శక్తిగా ఉన్నంత వరకే ప్రాణులు కళ కళ లాడుతూ వుంటాయి,
ఆ కళ తప్పితే కట్టెలవుతాయి. కనుక శరీరాలూ, శరీరుధారులూ శాశ్వతులు కారు..ఆ శరీరాలలో
సమానంగా వెలుగొందే ప్రత్యగాత్మ ఐన బ్రహ్మపదార్ధమే శాశ్వతం..కనుక శరీరానికి కాదు..
శరీరికి..అంటే లోపలి వెలుగుకి ప్రాధాన్యత నిచ్చే వాడూ, ఆ లోపలి వెలుగు అందరిలోనూ,
అన్నింటిలోనూ సమానంగా వున్నది కనుక, అందరూ, అన్నీ సమానమే అని భావించేవాడు,
శాశ్వతమైన దాన్నిగుర్తించి నిరంతరం స్మరించే వాడూ ఎవరో అతనే నా గురుదేవుడు!

1 comment:

  1. Good translation of Maneeshaa Panchakam 4. Looking forward for the rest of the slokas..

    Regards,
    Chandramowly
    cmowly@gmail.com

    ReplyDelete