Wednesday 4 January 2012

మనీషా పంచకం



యత్సౌ ఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వ్రుతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వ్రుత
యస్మిన్ నిత్య సుఖామ్బుధౌ కలిత ధీర్బ్ర హ్మైవ న బ్రహ్మవిత్
యః కశ్చిత్ ససురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ


ఏ సుఖ సాగర చిరు బిందువుగా
దేవేంద్రాదులు సంతసింతురో
చిత్తమునందే లేశమైన సుఖ
భావము పొందిన మునులానందింతురొ
ఆనందమిది అనుభవమిది యని
ఎరుగక అద్వైతానుభావమున
ఆనందమె తామై తాముందురొ
ఆ బ్రహ్మానందాంబుధి మునిగిన
బ్రహ్మానందమె తానై మిగిలిన
అద్వైతామృత విందులందిన
నరుడే సుర,ముని,బుధ వందితుడు,
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు!

ఏ ఆనంద సాగరపు లేశమైనా పొందినందుకు దేవేంద్రాదులు కూడా తరించి పోతారో,
కేవలం దేనిని మాత్రమే మనసులో పొందినందుకు మహా మునులు కూడా తరించిపోతారో
యే నిత్యమైన శాశ్వతమైన ఆనంద సాగర అనుభవం చేత అనుభవించేవాడూ, ఆ అనుభవమూ
ఏకమైపోతారో..అంటే అనుభవించేవాడు తనే ఆ అనుభవమై పోతాడో..అటువంటి ఆ అద్వైతానుభవ
ఆనంద సాగరమును చవిజుసిన వాడూ..దేవేంద్రాదులచేత కూడా నమస్కరింప బడిన పాద
పద్మములు గల ఆ మహానుభావుడే నా గురుదేవుడు! ఆది శంకరాచార్యులవారు ఇంతవరకూ
శుక రహస్యోపనిషత్తుకు వ్యాఖ్యాన పూర్వకంగా చెప్పిన మనీషా పంచకంలోని చివరి
ఐదవ శ్లోకం ఇది. ఈ స్తోత్ర ఫల శ్రుతిగా, శుక రహస్యోపనిషత్తుకు ఫలశ్రుతిగా, ఈ రెండింటిని
తెలిసికొని,ఆచరించి, అనుభవించిన ఆనందానికి ఫల శ్రుతిగా ఈ చివరి శ్లోకాన్ని చెప్పారు!
శుక రహస్యోపనిషత్తు చివరిలో, పరమ శివుడు తనకు నాలుగు మహావాక్యములను ఉపాసనా
మార్గంలో ఉపదేశించిన తర్వాత, ఆ మహావాక్య అనుభవ సారమనే ఆనంద సాగరంలో ఈదులాడుతున్న
వానివలె, పరమేశ్వరునకు నమస్కరించి అక్కడినుండి స్వేచ్చగా వెళ్ళిపోయాడు అని
శుకరహస్యోపనిషత్తు ముగింపు జరుగుతుంది..ఇక్కడ అదే భావాన్ని వ్యక్తం చేసిన ఆది శంకరాచార్యులవారు మహావాక్య చతుష్టయాన్ని, వాటిని ఉపదేశించిన శుకరహస్యోపనిషత్తునూ,
ఆ ఉపనిషత్తుకు వ్యాఖ్యానపూర్వకంగా చెప్పిన మనీషా పంచక స్తోత్రమునూ పఠించిన, అవగతం చేసుకున్న, అనుభవించిన ఫలితము ఏమిటో ఫలశ్రుతిగా ఈ చివరి శ్లోకంలో చెప్పారు!

మనీషా పంచకమును ఎందరో మహానుభావులు, జగద్గురువులు, గురుతుల్యులు, పండితులు,
పూర్వం వ్యాఖ్యానించి వున్నారు. వారి ప్రజ్ఞలో ఆవగింజలో అరవయ్యవ వంతు కూడా లేని అల్పుడిని
అజ్ఞానిని ఐన నేను నా అదృష్ట కారణంగా, ఆదిశంకరుల మీద నాకున్న కేవల భక్తి భావ విశేషం చేత,
ఆ గురుదేవుని కృప చేత, శుకరహస్యోపనిషత్తుకు అనువాదపుర్వకమా అన్నంత సారూప్యాన్ని, సామీప్యాన్నిమనీషా పంచకం కలిగివుందని తెలిసికొన్న కారణంగా, ఆ సారూప్యాన్ని, పోలికలను బయటకు తెచ్చేఉద్దేశంతో, ఆదిశంకరుని పలుకులు ఉపనిషత్తుల మందాకినీ కులుకులు అని మరొక దృష్టాంతం పాఠకుల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నమును చేయడం జరిగింది.

మనీషా పంచాకములోని ఐదు శ్లోకాలకూ ఈ వ్యాసంలో ఇచ్చిన అనువాద గేయాలు నేను రచించినవి. కారణం.. మనీషాపంచకం మీది ప్రేమ, సంస్కృతం లోని ఆ శ్లోకాలను తెలుగులో సరళంగా సులభంగా అర్థం చేసుకోవడానికి సహకారంగా వుంటాయి అని. ఈ దీర్ఘ వ్యాసంలో ఏవైనా దోషాలుంటే పాఠకులు మన్నింతురుగాక! తన స్తోత్ర ఫలముగా గురుదేవుడు ప్రవచించిన మానసిక ప్రశాంతత నాకూ..నాలాంటి ఎందరో సామాన్య జనులకు లభించునుగాక!ఆదిశంకర దివ్య వాణి అనంతకాలములందు అవనిలో ప్రతిధ్వనించును గాక!

ఓం తత్ సత్!!! ఓం శాంతి:శాంతి:శాంతి:

No comments:

Post a Comment